ప్రెస్‌రివ్యూ: ‘కృష్ణుడి కంటే కరుణానిధే గొప్ప’

ఫొటో సోర్స్, Getty Images
‘పాలనా సామర్థ్యంలో శ్రీకృష్ణుడి కంటే డీఎంకే అధినేత కరుణానిధే గొప్ప’ అని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా అన్నట్లు ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
పలు రూపాలతో తాను విశ్వరూపం దాల్చేటప్పుడు మూలరూపాన్ని గుర్తించాలని పాండవులకు శ్రీకృష్ణుడు పరీక్ష పెట్టాడు. వేదాలలో ఆరితేరిన సహదేవుడు మాత్రమే మూలరూపాన్ని గుర్తించాడు.
అలాగే ఇప్పుడు కరుణానిధి మూలరూపాన్ని గుర్తించేందుకు పలువురు పలురకాల రూపాలను పట్టుకుంటున్నారు. శ్రీకృష్ణుడి కంటే అధిక పాలనా సామర్థ్యం ఉన్న కరుణానిధి మూలరూపాన్ని గుర్తించడం అసాధ్యం అని రాజా పేర్కొన్నారు అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో లిక్కర్ చాక్లెట్లు
బ్రాందీ, విస్కీ, రమ్ముతో తయారు చేసిన లిక్కర్ చాక్లెట్ల అమ్మకాలు హైదరాబాద్‌లోనే జోరుగా సాగుతున్నాయని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
ఇలాంటి చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్ చాక్లెట్లను డెన్మార్క్ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్ నగరాల్లో విక్రయిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ ముఠాతో ఒప్పందం చేసుకొని విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.
లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్‌లో 4 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలో ఇలాగే లిక్కర్ చాక్లెట్లను సరఫరా చేసిన అబిడ్స్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇంట్లోనే లిక్కర్ చాక్లెట్ల కంపెనీ పెట్టాడు. స్థానికంగా లభించే విస్కీ, బ్రాందీ, రమ్ము తీసుకొచ్చి వాటితో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
నిందితుడి నుంచి 1.3 కిలోల విస్కీ చాక్లెట్లు, 1.5 కిలోల రమ్ము చాక్లెట్లు, 6.4 కిలోల చాక్లెట్ పదార్థాలు, లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, uttam kumar reddy/facebook
కాంగ్రెస్‌లో గ్రూపుల గోల!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాలు ఆ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించిది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా కొందరు గ్రూపులు కట్టి పనిచేసే స్థాయిలో విభేదాలు ముసురుకోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో గ్రూపులు, గొడవలు సాధారణమే అని చెప్పుకున్నా.. ప్రస్తుతం ఆ గొడవలు పరిష్కరించలేని స్థాయికి వెళ్లడం ఆందోళనకరంగా మారిందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక నేత (కొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు కూడా) పార్టీని తానే నడిపించాలనే కోరికతో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతం కోసం తామంటే తాము పాదయాత్రలు చేస్తామని అధిష్ఠానానికి ప్రతిపాదనలు పంపారు.
దీంతో అధిష్ఠానం అనుమతి ఇవ్వలేదు. కీలక నేతల్లో కొందరు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వర్గంగా, మరికొందరు ఆయన వ్యతిరేక వర్గంగా బాహాటంగానే చెప్పుకుంటున్నారు. గత నెలలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కొందరు నేతలు ఢిల్లీ వెళ్లారు. వారంతా రాహుల్‌తో ఉత్తమ్ పనితీరుపై ఫిర్యాదు చేశారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
తర్వాత ఫిర్యాదు అవాస్తవమని తేలినా.. ఢిల్లీ పెద్దలు కొందరిని కలిసి ఉత్తమ్‌కు వ్యతిరేకంగా నివేదికలిచ్చారనే చర్చ పార్టీలో ఉంది. బస్సుయాత్ర విషయంలో కూడా అసమ్మతి నేతలు గుర్రుగానే ఉన్నారు.
బస్సుయాత్ర ప్రారంభించే విషయంలోనే నేతల మధ్య విభేదాలు రాగా, యాత్రల సందర్భంగా కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు ఉత్తమ్ వ్యతిరేక వర్గం అసహనానికి కారణమయ్యాయి. బస్సుయాత్ర తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, అందుకే తాత్కాలికంగా నిలిపివేశారనే చర్చ కూడా జరుగుతోందని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
బరువు తగ్గింపు ప్రకటనలతో జాగ్రత్త
'నెల రోజుల్లోనే 10 కిలోల బరువును తగ్గిస్తాం.. ఏడాది కిందట లావుగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడెంత నాజూగ్గా మారిపోయాడో..' అంటూ గుప్పిస్తున్న ఆకర్షణీయ ప్రకటనలతో అనేకమంది అటువైపుగా మొగ్గుచూపి అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
'శాస్త్రీయతతో పనిలేదు.. మేం చెప్పిన ఆహార పద్ధతులు పాటించండి చాలు.. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు పారిపోతుందని' చెప్పే ప్రచార ఆర్భాటాలకు లొంగిపోతున్నారు. గత మూణ్నాలుగు నెలల్లో ఈ విషవలయంలో చిక్కి పెద్ద సంఖ్యలో బాధితులు అనారోగ్యం పాలయ్యారు.
అధిక బరువు వల్ల తలెత్తే సమస్యలకంటే దాన్ని తగ్గించుకోవడానికి పడే పాట్లే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో సంచలన రీతిలో ప్రాచుర్యం పొందిన 'ఓ తరహా ఆహారపు పద్ధతి'ని పాటించి.. ఆ తర్వాత అనారోగ్యం బారినపడిన వారిలో మధ్యతరగతి ప్రజలతోపాటు ఉన్నత స్థాయి వ్యక్తులూ ఉండడం గమనార్హం.
అధిక బరువు తగ్గించుకునేందుకు శాస్త్రీయ విధానాలు పాటించకపోతే.. కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తున్నట్లు పలు దృష్టాంతాలు హెచ్చరిస్తున్నాయి. బరువు తగ్గడానికి అవలంబించే మార్గాలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం ఈ తరహా సంఘటనలకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారని ఈనాడు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం?
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- హాలీవుడ్ సినిమాల రేంజ్లో జైళ్ల నుంచి తప్పించుకున్నారు వీళ్లంతా
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























